Aloo Pakoda : మనం బంగాళాదుంపలతో కూరలే కాకుండా వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో ఆలూ పకోడీలు కూడా ఒకటి. ఆలూ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే ఆ ఆలూ పకోడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పకోడి తయారీకి కావల్సిన పదార్థాలు..
బంగాళాదుంపలు – 2, శనగపిండి -ఒక కప్పు, బియ్యంపిండి – పావు కప్పు, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, వాము – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, వేడి నూనె -2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
ఆలూ పకోడి తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలపై ఉండే చెక్కును తీసేసి వాటిని పలుచగా స్లైసెస్ గా కట్ చేసుకోవాలి. తరువాత వీటిని నీటిలో వేసి కడిగి తరువాత వస్త్రంపై వేసి తడి అంతా పోయే వరకు ఆరబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె మధ్యస్థంగా వేడయ్యాక బంగాళాదుంప స్లైసెస్ ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పకోడీలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.