Aloo Pepper Fry : బంగాళాదుంపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. బంగాళాదుంపలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. బంగాళాదుంపలతో ఎక్కువగా చేసే వంటకాల్లో బంగాళాదుంప వేపుడు ఒకటి. బంగాళాదుంప వేపుడును మనం రకరకాల రుచుల్లో తయారు చేస్తూ ఉంటాం. తరచూ తయారు చేసే బంగాళాదుంప వేపుడు కంటే మరింత రుచిగా కూడా దీనిని తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా కరకరలాడుతూ ఉండేలా ఆలూ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ పెప్పర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – అరకిలో, మిరియాలు -ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, నూనె – 3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్.
ఆలూ పెప్పర్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంప ముక్కలను రెండు నుండి మూడు సార్లు బాగా కడిగి నీటిలో వేసి పక్కకు ఉంచాలి. తరువాత ఒక జార్ లో మిరియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బంగాళాదుంప ముక్కలను వేసి కలుపుతూ వేయించాలి. బంగాళాదుంప ముక్కలను ఎర్రగా, కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మిరియాల మిశ్రమం వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత వేయించిన బంగాళాదుంప ముక్కలను వేసి కలపాలి.
తరువాత ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పెప్పర్ ఫ్రై తయారవుతుంది. దీనిని పప్పు, సాంబార్, రసం వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే బంగాళాదుంప ఫ్రైతో పాటు అప్పుడప్పుడూ ఇలా మిరియాలు వేసి కూడా ఫ్రై చేసుకుని తినవచ్చు.