Aloo Tomato Capsicum Masala Curry : మనం క్యాప్సికంతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. క్యాప్సికంలో కూడా ఎన్నో పోషకాలు, ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. క్యాప్సికంను ఎక్కువగా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీనితో కూడా మనం ఎన్నో రకాల కూరలను తయారు చేసుకుని తినవచ్చు. క్యాప్సికంతో చేసే కూరలు చాలా రుచిగా ఉంటాయి. అందులో భాగంగా క్యాప్సికంతో ఎంతో రుచిగా ఉండే ఆలూ టమాట క్యాప్సికం మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ టమాట క్యాప్సికం మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన టమాటాలు – 4, తరిగిన క్యాప్సికం – 2, ఉడికించిన బంగాళాదుంపలు – 2, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మసాలా దినుసులు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, పల్లీలు – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, లవంగాలు – 5, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 3, బిర్యానీ ఆకు – 1, జీడిపప్పు – 6, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్.
ఆలూ టమాట క్యాప్సికం మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా దినుసులు వేసి వేయించాలి. ఇవి దోరగా వేగిన తరువాత నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి మరో నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. వీటిని సగానికి పైగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. వీటిని చక్కగా వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూతను ఉంచి టమాట ముక్కలను మెత్తగా ఉడికించాలి.
టమాట ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత బంగాళాదుంప ముక్కలు, వేయించిన క్యాప్సికం ముక్కలు వేసి కలపాలి. తరువాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిపై మూతను ఉంచి మధ్యస్థ మంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ టమాట క్యాప్సికం కర్రీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాప్సికంతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా మసాలా కూరను కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.