Alu Masala Fry : దుంప జాతికి చెందిన కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. దీనిని మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంపలను మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బంగాళాదుంపలతో చేసే వంటకాల్లో వేపుడు కూడా ఒకటి. బంగాళాదుంపలతో చేసే వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ బంగాళాదుంప వేపుడును మసాలా వేసి మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంపల మసాలా వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – పావు కిలో, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయలు – 2 ( పెద్దవి), నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బంగాళాదుంప మసాలా వేపుడు తయారీ విధానం..
ముందుగా ఉడికించిన బంగాళాదుంపల పొట్టును తీసి పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత కచ్చా పచ్చా దంచిన ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను రంగు మారే వరకు బాగా వేయించాలి. తరువాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి ఒక నిమిషం పాటు వేయించాలి.
తరువాత బంగాళాదుంపల ముక్కలను వేసి కలపాలి. ఈ బంగాళాదుంపల ముక్కలను 5 నుండి 10 నిమిషాల పాటు రంగు మారే వరకు బాగా వేయించాలి. ఇలా వేయించిన తరువాత కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బంగాళాదుంప మసాలా వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బంగాళాదుంపలతో తరచూ చేసే వంటకాలకు బదులుగా ఇలా మసాలాను వేసి కూడా వేపుడును చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. అందరికీ ఎంతగానో నచ్చుతుంది.