Andhra Pappu Chekkalu : మనం సులభంగా చేసుకోదగిన పిండి వంటకాల్లో చెక్కలు కూడా ఒకటి. చెక్కలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఎక్కువగా పండగలకు వీటిని తయారు చేస్తూ ఉంటారు. చెక్కలను తయారు చేయడం చాలా సులభం. మనం ఎక్కువగా వీటిని తయారు చేయడానికి పొడి బియ్యం పిండిని వాడుతూ ఉంటాము. పొడి బియ్యంపిండితో పాటు తడి బియ్యం పిండితో కూడా మనం చెక్కలను తయారు చేసుకోవచ్చు. తడి బియ్యం పిండితో చేసే చెక్కలు మరింత క్రిస్పీగా ఉంటాయి. తడి బియ్యంపిండితో ఆంధ్రా స్టైల్ లో ఈ పప్పు చెక్కలను రుచిగా, క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రా పప్పు చెక్కల తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – కిలో, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, కరివేపాకు – గుప్పెడు, జీలకర్ర – ఒక టీ స్పూన్, నానబెట్టిన శనగపప్పు – అర కప్పు, నానబెట్టిన పెసరపప్పు – అర కప్పు, ఉప్పు – తగినంత, బటర్ – 2 స్పూన్స్, గోరు వెచ్చని నీళ్లు – తగినన్ని, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.

ఆంధ్రా పప్పు చెక్కల తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని పూర్తిగా నీళ్లు లేకుండా వడకట్టి మర ఆడించి పిండిలా చేసుకోవాలి. తరువాత తడి బియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు జార్ లో పచ్చిమిర్చి,జీలకర్ర, కరివేపాకు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ పేస్ట్ ను పిండిలో వేసి కలపాలి. తరువాత శనగపప్పు, పెసరపప్పు, ఉప్పు, బటర్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత గోరు వెచ్చని నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా చూసుకోవాలి. తరువాత పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండను తీసుకుంటూ పూరీ ప్రెస్ సహాయంతో చెక్కలుగా వత్తుకోవాలి.
పూరీ ప్రెస్ లో పాలిథిన్ కవర్ ను దానికి నూనె రాయాలి. తరువాత పిండి ఉండను ఉంచి చెక్కలా వత్తుకుని వస్త్రంపై వేసుకోవాలి. పూరీ ప్రెస్ లేని వారు చేత్తో కూడా చెక్కలను వత్తుకోవచ్చు. ఇలా తగినన్ని వత్తుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చెక్కలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆంధ్రా పప్పు చెక్కలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.