Aratikaya Avakura : పచ్చి అరటికాయను కూడా మనం ఆహారంగా తీసుకంటూ ఉంటాం. పచ్చి అరటికాయలతో వండిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పచ్చి అరటికాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ పచ్చి అరటికాయలతో రుచిగా, సులభంగా, చాలా తక్కువ సమయంలో చేసుకోదగిన వంటకాల్లో అరటికాయ ఆవకూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వారు కూడా దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అరటికాయలతో ఆవకూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరటికాయ ఆవకూర తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పచ్చి అరటికాయలు – 3, నానబెట్టిన చింతపండు- చిన్న నిమ్మకాయంత, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – ముప్పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 4, ఎండుమిర్చి -3, ఇంగువ – పావు టీ స్పూన్.
అరటికాయ ఆవకూర తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో అరటికాయ ముక్కలు, పసుపు, తగినన్ని నీళ్లు, తగినంత ఉప్పు, చింతపండు రపం వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత జార్ లో అర టీ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత ఉడికించిన అరటికాయ ముక్కలను వేసి కలపాలి. ఈ అరటి కాయ ముక్కలను మూడు నుండి నాలుగు నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తరువాత మిక్సీ పట్టుకున్న ఆవ పిండిని రుచి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి.
ఆవపిండి ఎక్కువగా వేస్తే కూర చేదుగా అయ్యే అవకాశం ఉంది. కనుక కొద్ది కొద్దిగా ఆవపిండిని వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అరటికాయ ఆవకూర తయారవుతుంది. దీనిని సాంబార్, రసం వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చి అరటికాయలతో ఈ విధంగా కూరను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ అరటికాయ ఆవకూరను కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.