Tiffin Center Allam Pachadi : అల్లం.. దీనిని వంటల్లో వాడని వారు ఉండరనే చెప్పవచ్చు. అల్లాన్ని పేస్ట్ గా, ముక్కలుగా చేసి వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వంటల్లో అల్లాన్ని వేయడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని వాడడం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వంటల్లో వాడడంతో పాటు అల్లంతో మనం ఎంత రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటాం. అల్లం పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని ఎండుమిర్చి వేసి పచ్చిమిర్చి వేసి కూడా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసి టిఫిన్ సెంటర్లలలో లభించే విధంగా ఈ అల్లం పచ్చడిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన అల్లం ముక్కలు – అర కప్పు, నానబెట్టిన చింతపండు – అర కప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, పచ్చిమిర్చి – 20 లేదా తగినన్ని, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 6, బెల్లం తురుము – ఒక కప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – రెండు టేబుల్ స్పూన్స్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
అల్లం పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని కూడా జార్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. మరలా అదే కళాయిలో అల్లం ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని కూడా జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్ లో ఉప్పు, నానబెట్టిన చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత బెల్లం తురుము వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేయించాలి. తరువాత ఇందులో తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
తరువాత ఈ తాళింపును ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడి తయారవుతుంది. దీనిని గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకోవడం వల్ల ఈ పచ్చడి నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ విధంగా అల్లం పచ్చడిని తయారు చేసుకుని అన్ని రకాల అల్పాహారాలతో కలిపి తినవచ్చు. ఈ పచ్చడిని తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.