Aratikayala Vadalu : మనం పచ్చి అరటికాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పచ్చి అరటికాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు ఎంతగానో దోహదపడతాయి. పచ్చి అరటికాయలతో చిప్స్ మాత్రమే కాకుండా మనం ఇతర చిరుతిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు. వాటిలో అరటికాయ వడలు కూడా ఒకటి. అరటికాయ వడలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. పచ్చిఅరటికాయలతో రుచిగా, సులభంగా వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటికాయ వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి అరటికాయలు – 2, శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి – ఒక కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తురుము – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, ఉప్పు – తగినంత.
అరటికాయ వడ తయారీ విధానం..
ముందుగా అరటికాయలను మెత్తగా ఉడికించాలి. తరువాత వాటిపై ఉండే తొక్కను తీసేసి గుజ్జును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు వడ పిండి మాదిరి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపు ప్లాస్టిక్ కవర్ కు నూనె రాసి తీసుకోవాలి. అలాగే చేతికి కూడా నూనె రాసుకుని పిండిని తీసుకుని కవర్ పై ఉంచి వడ లాగా వత్తుకోవాలి. వీటిని నూనెలో వేసి వేయించాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటి కాయ వడలు తయారవుతాయి. వీటిని చట్నీతో, టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ వడలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.