Brahmi Plant : చెరువుల వద్ద, కుంటల వద్ద చిత్తడి నేలల్లో ఎక్కువగా పెరిగే మొక్కలల్లో సరస్వతి మొక్క కూడా ఒకటి. దీనిని సంస్కృతంలో బ్రహ్మి, మహైషది అని అంటారు. దీనిని ఇంగ్లీష్ లో ఇండియన్ పెన్నివార్ట్ అని అంటారు. ఈ మొక్కను మనలో చాలా మంది చూసి ఉంటారు. ఈ మొక్క ఆకులు చుట్టూ నొక్కులను కలిగి పొడవాటి కాడ కలిగి ఉంటాయి. ఈ మొక్కను చాలా మంది సాధారణ మొక్కగా భావిస్తూ ఉంటారు కానీ ఈ సరస్వతి మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులు తీపి, వగరు రుచిని కలిగి ఉంటుంది. ఈ మొక్కను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా పెంచుకోవచ్చు. సరస్వతి ఆకు వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసిన తరువాత ఈ మొక్క ఆకులను నమలడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. పైత్యం, జ్వరం, మేహ పైత్యం, కుష్టు, దురదలు వంటి సమస్యలను తగ్గించడంలో సరస్వతి ఆకు మనకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే వ్రణాలను, కఫాన్ని, వాతాన్ని తగ్గించడంలో కూడా సరస్వతి ఆకు మనకు ఉపయోగపడుతుంది. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల రక్తం శుద్ది అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.నరాలు బలంగా తయారవుతాయి. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సరస్వతి ఆకు మనకు దోహదపడుతుంది. సరస్వతి మొక్క ఆకులను ఉపయోగించడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయి.
అలాగే ఈ ఆకుల రసాన్ని నూనెలో వేసి జుట్టుకు కూడా రాసుకోవచ్చు. మనకు ఆయుర్వేద షాపుల్లో సరస్వతి మొక్కతో తయారు చేసిన సప్లిమెంట్స్ లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుకునే పిల్లలు దీనిని తీసుకోవడం వల్ల వారు చదువులో రాణిస్తారని నిపుణులు చెబుతున్నారు. అలాగే సరస్వతి చూర్ణం కడా మనకు ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. దీనిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక టీ స్పూన్ తేనెతో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల మంచి ఫలితం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సరస్వతి మొక్కను ప్రతి ఒక్కరు తప్పకుండా ఇంట్లో పెంచుకోవాలని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.