Arikela Kichdi : ప్రస్తుతం చాలా మంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వాటిల్లో ఎక్కువగా జీవనశైలి సంబంధిత సమస్యలే ఉంటున్నాయి. ఇవి సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే వస్తున్నాయి. అయితే సరైన పోషకాహారాన్ని తీసుకుంటే ఈ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. అందుకు గాను చిరు ధాన్యాలు మనకు ఎంతగానో దోహదపడతాయి. వాటిల్లో అరికెలు కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. ఇవి బరువును తగ్గిస్తాయి. షుగర్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. ఇక వీటితో ఆరోగ్యవంతమైన టిఫిన్‌ను ఎలా తయారు చేయాలో, అందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరికెలు – అర కప్పు, పెసర పప్పు – అర కప్పు, పచ్చి బఠానీ – అర కప్పు, ఉల్లిపాయ – ఒకటి, టమాటా – 1, అల్లం తరుగు – 1 టీస్పూన్, పచ్చి మిర్చి – 2, కరివేపాకు రెబ్బలు – 2, జీలకర్ర – అర టీస్పూన్, ఇంగువ – చిటికెడు, కారం – 1 టీస్పూన్, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, పసుపు – కొద్దిగా.
అరికెలు, పెసరపప్పును ఒక గిన్నెలో తీసుకుని గంటసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇది వేడయ్యాక జీలకర్ర, అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తరువాత పసుపు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా తరుగు, పచ్చి బఠానీ వేసి బాగా కలిపి కారం, తగినంత ఉప్పు, రెండు కప్పుల నీళ్లు పోసి అరికెలు, పెసర పప్పు వేసి మూత పెట్టి ఒక కూత వచ్చాక దింపేయాలి. తరువాత కిచిడీని బాగా కలిపి వడ్డించేముందు మిగిలిన నెయ్యి వేస్తే సరిపోతుంది.