Atukula Sweet : అటుకులు..వీటిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అటుకుల మిక్చర్, పోహా వంటి వాటితో పాటు తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అటుకులతో చేసుకోదగిన తీపి వంటకాల్లో అటుకుల చిక్కీ కూడా ఒకటి. అటుకులు, పల్లీలు, బెల్లం కలిపి చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. పాకం పట్టే అవసరం లేకుండా సులభంగా అటుకుల స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అటుకుల స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, అటుకులు – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, నీళ్లు -ఒక కప్పు, గసగసాలు – ఒక టీ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ – తగినన్ని.
అటుకుల స్వీట్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. వీటిని దోరగా వేయించిన తరువాత ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో అటుకుల వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.ఇప్పుడు పల్లీలపై ఉండే పొట్టును తీసేసి జార్ లోకి తీసుకోవాలి. తరువాత వీటిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులు ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో అటుకులు, గసగసాలు కూడా వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత దీనిని వడకట్టి మరలా కళాయిలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీటిని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించిన తరువాత పల్లీల పొడి వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై 2 నిమిషాల పాటు ఉడికించిన తరువాత అటుకుల పొడి వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై అడుగు మాడిపోకుండా దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి.
అటుకుల మిశ్రమం దగ్గర పడిన తరువాత యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. దీనిని కళాయికి అంటుకోకుండా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ప్లేట్ లో వేసుకుని చిక్కీ లాగా తయారు చేసుకోవచ్చు లేదా ఉండలుగా వత్తుకోవచ్చు. కేవలం ఉండలే కాకుండా మనకు కావల్సిన ఆకారంలో అచ్చులుగా చేసుకోవచ్చు. అయితే ఈ మిశ్రమం చల్లారే కొద్ది గట్టి పడుతుంది కనుక వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సిన ఆకారంలో వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల స్వీట్ తయారవుతుంది. దీనిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అటుకులతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.