Avakaya Biryani : మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తినే పచ్చళ్లల్లో ఆవకాయ పచ్చడి ఒకటి. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. అన్నంలో ఆవకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడంతో పాటు ఈ ఆవకాయ పచ్చడితో మనం ఎంతో రుచిగా ఉండే బిర్యానీని కూడా తయారు చేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడితో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా దీనిని తేలికగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఆవకాయ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవకాయ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన బియ్యం – 2 కప్పులు, తరిగిన బంగాళాదుంప – 1, పచ్చి బఠాణీ – పావు కప్పు, తరిగిన బీన్స్ – 8, తరిగిన క్యారెట్ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 4, లవంగాలు – 4, అనాస పువ్వు – 1, జాప్రతి – 1, సాజీరా – ఒక టీ స్పూన్, పెరుగు – పావు కప్పు, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, ఆవకాయ పచ్చడి – 3 టేబుల్ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, బిర్యానీ మసాలా – ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
ఆవకాయ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మసాలా దినుసులు వేసి వేయించాలి. మసాలా దినుసులు వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగానికి పైగా వేగిన తరువాత కూరగాయ ముక్కలు, పచ్చి బఠాణీ వేసి వేయించాలి. కూరగాయ ముక్కలను పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత కొత్తిమీర. పుదీనా, పసుపు, ఉప్పు, బిర్యానీ మసాలా, కారం, గరం మసాలా వేసి కలపాలి. తరువాత పెరుగు వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి.
తరువాత ఆవకాయ పచ్చడిని వేసి కలపాలి. తరువాత మూడు కప్పుల నీళ్లు పోసి కలపాలి. తరువాత నానబెట్టుకున్న బియ్యం వేసి కలపాలి. దీనిని మధ్యస్థ మంటపై దగ్గర పడే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత మరోసారి కలుపుకుని మూత పెట్టి చిన్న మంటపై 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆవకాయ బిర్యానీ తయారవుతుంది. నోటికి రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఆవకాయ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.