Banana Halwa : అరటి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో ఉండే పొటాషియం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు అయినా సరే తగ్గుతాయి. గ్యాస్, మలబద్దకం, అసిడిటీ వంటివి ఉండవు. అయితే ఈ పండ్లను నేరుగా తినడంతోపాటు వీటితో పలు రకాల తీపి వంటకాలను కూడా చేసుకోవచ్చు. వాటిల్లో అరటి పండు హల్వా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. సులభంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండ్ల హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
అరటి పండ్లు – 2, చక్కెర – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – 1 టేబుల్ స్పూన్, నెయ్యి – 2 టీస్పూన్లు, యాలకుల పొడి – పావు టీస్పూన్.
అరటి పండ్ల హల్వాను తయారు చేసే విధానం..
ఒక నాన్ స్టిక్ పాన్‌లో చక్కెర, నీళ్లు వేసి సన్నని మంటపై చక్కెర పూర్తిగా కరిగిపోయేవరకు మరిగించాలి. తరువాత అరటి పండ్లను చిన్న ముక్కలుగా తరిగి చక్కెర మిశ్రమంలో వేసి 10 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి అరటి పండ్ల ముక్కలను మెత్తగా చిదిమి టీ స్పూన్ నెయ్యి వేసి కలిపి తిరిగి సన్నని మంటపై పెట్టి ఉడికించాలి. పదార్థం అంతా మధ్యకు చేరుతూ అంచులు పాన్‌ను వదిలిపెడుతున్నప్పుడు యాలకుల పొడి వేసి బాగా కలిపి నెయ్యి రాసిన ప్లేట్‌లోకి తీసి చల్లారాక ముక్కలుగా కట్ చేయాలి. దీంతో ఎంతో రుచికరమైన అరటి పండ్ల హల్వా తినేందుకు సిద్ధమవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.