Basundi : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో బాసుంది కూడా ఒకటి. పాలతో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. బాసుందిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా కమ్మగా ఉండే ఈ బాసుందిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడానికి సమయం ఎక్కువగా పట్టినప్పటికి తయారు చేయడం మాత్రం సులభం. కమ్మగా, రుచిగా ఉండే ఈ బాసుందిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాసుంది తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి గేదె పాలు – ఒక లీటర్, పంచదార – పావు కప్పు, యాలకుల పొడి – పావు టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా.
బాసుంది తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో పాలను పోసి వేడి చేయాలి. ఈ పాలను కలుపుతూ మధ్యస్థ మంటపై ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. పాలు పొంగు రాగానే మంటను చిన్నగా చేయాలి. తరువాత ఒక ప్లేట్ లేదా విసనకర్రతో పాలపై విసురుతూ ఉండాలి. ఇలా విసరడం వల్ల పాలపై మీగడ ఏర్పడుతుంది. ఈ మీగడను కళాయి నుండి వేరు చేసి మధ్యలో చిరిగి పోకుండా నెమ్మదిగా తీసి కళాయి అంచులపై వేసుకోవాలి. మీగడను తీయడానికి సన్నటి పదునుగా ఉండే పుల్లను ఉపయోగిస్తే మీగడ చిరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఇలా మీగడను తీసిన తరువాత మరలా ప్లేట్ తో లేదా విసనకర్రతో విసరాలి. మరలా వచ్చిన మీగడను కళాయి అంచులపై వేసుకోవాలి. ఇలా పాలను 100 ఎమ్ ఎల్ అయ్యే వరకు మరిగించిన మీగడను తీసుకుంటూ ఉండాలి.
పాలు 100 ఎమ్ ఎల్ అయిన తరువాత అందులో పంచదార వేసి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాలను పూర్తిగా చల్లారనివ్వాలి. పాలు చల్లారిన తరువాత కళాయి అంచుల వెంబడి ఉండే మీగడను తీసి పాలల్లో వేసి కలపాలి. అలాగే యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు ఈ పాలను గంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. తరువాత దీనిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బాసుంది తయారవుతుంది. దీనిని చల్లచల్లగా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది.ఈ బాసుందిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.