Bathani Chaat : మనకు సాయంత్రం సమయాల్లో చాట్ బండార్ లలో, బండ్ల మీద లభించే పదార్థాల్లో బఠాణీ చాట్ కూడా ఒకటి. బఠాణీలతో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. బయట తినే పని లేకుండా ఈ బఠాణీ చాట్ ను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రుచిగా, చక్కగా బఠాణీ చాట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బఠాణీ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
రాత్రంతా నానబెట్టిన బఠాణీ – 200 గ్రా., ఉడికించిన బంగాళాదుంప – 1, చిన్నగా తరిగిన టమాటాలు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్.
టాపింగ్ కోసం కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన టమాటా – 1, నిమ్మకాయ – అర చెక్క, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, పానీ పూరీ పూరీలు – 3, క్యారెట్ తరుము – కొద్దిగా, సేవ్ – కొద్దిగా.
బఠాణీ చాట్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో నానబెట్టిన బఠాణీ, రెండు గ్లాసుల నీళ్లు పోసి మూత పెట్టాలి. ఈ బఠాణీలను చిన్న మంటపై 5 విజిల్స్ వచ్చే ఉడికించాలి. తరువాత మూత తీసి బఠాణీలను పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత ఇందులో ఉడికించిన బఠాణీని నీటితో సహా వేసుకోవాలి. తరువాత బంగాళాదుంప ముక్కలను కూడా వేసి కలపాలి. వీటిని 10 నిమిషాల పాటు ఉడికించిన తరువాత పప్పు గుత్తితో లేదా స్మ్యాషర్ తో బఠాణీని, ఆలుగడ్డలను మెత్తగా చేసుకోవాలి. తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఈ చాట్ ను ఒక ప్లేట్ లోకి లేదా గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దానిపై ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ స్వీ్ట చట్నీని వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీరను, టమాట ముక్కలను, క్యారెట్ తురుమును చల్లుకోవాలి. తరువాత పూరీని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బఠాణీ చాట్ తయారవుతుంది. పూరీ అందుబాటులో లేని వారు కార్న్ ఫ్లేక్స్ ను లేదా చిప్స్ కూడా చల్లుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సాయంత్రం సమయాల్లో ఈ విధంగా చాట్ ను తయారు చేసుకుని తినవచ్చు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసిన చాట్ ను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే చాట్ ను తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది.