Bathani Chat : మనకు బయట సాయంత్రం సమయాలలో తినడానికి లభించే చిరుతిళ్లలో చాట్ కూడా ఒకటి. ఇది మనకు ఎక్కువగా పానీపూరీ బండ్ల దగ్గర లభిస్తుంది. అలాగే హోటల్స్ లో కూడా ఇది మనకు దొరుకుతుంది. మనకు బయట వివిధ రుచుల్లో ఈ చాట్ లభిస్తుంది. మనకు లభించే వాటిల్లో బఠాణీ చాట్ కూడ ఒకటి. ఎండు బఠాణీలను ఉపయోగించి చేసే ఈ చాట్ ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు.
అయితే కొందరు అపరిశుభ్ర వాతావరణంలో తినడానికి ఇష్టపడక దీనిని తినడమే మానేస్తారు. బయట దొరికే విధంగా ఉండే ఈ బఠాణీ చాట్ ను మనం ఇంట్లోనే చాలా సులుభంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో బఠాణీ చాట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బఠాణీ చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తెల్ల బఠాణీలు – ఒక కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయ – 1 (మధ్యస్థంగా ఉన్నది), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, టమాటాలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మరసం – కొద్దిగా, వేయించిన కార్న్ ఫ్లేక్స్ – తగినన్ని.
బఠాణీ చాట్ తయారీ విధానం..
ముందుగా బఠాణీలను ఒక గిన్నెలో తీసుకుని తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ బఠాణీలను కుక్కర్ లో వేసి అవి మునిగే వరకు నీటిని పోయాలి. తరువాత అందులోనే ఒక టీ స్పూన్ ఉప్పును, చిటికెడు పసుపును, ఒక టీ స్పూన్ నూనెను వేసి మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి బఠాణీలు కొద్దిగా చల్లగా అయిన తరువాత వాటిలో నుండి సగం బఠాణీలను తీసుకుని జార్ లో వేసి పేస్ట్ గా చేసుకోవాలి.
తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయలను వేసి మధ్యస్థ మంటపై అవి రంగు మారే వరకు వేయించుకోవాలి. తరువాత అందులోనే టమాటాలను మెత్తగా ఫ్యూరీ లాగా చేసి వేయాలి. తరువాత పసుపును కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న బఠాణీ మిశ్రమాన్ని అలాగే ఉడికించిన బఠాణీలను వేసి మరో 2 నిమిషాల పాటు బాగా వేయించాలి. తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, రుచికి తగినంత మరికొద్దిగా ఉప్పును వేసి కలిపి 3 నిమిషాల పాటు ఉంచాలి.
తరువాత తగినన్ని నీళ్లను పోసి కలిపి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసిన చాట్ ను ఒక గిన్నెలోకి తీసుకుని దానిపై ఉల్లిపాయ ముక్కలను, కొత్తిమీరను, నిమ్మరసాన్ని, వేయించిన కార్న్ ఫ్లేక్స్ ను నలిపి వేసుకోవాలి. దీనిపై టమాట ముక్కలను, సన్నని కారపూసను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు అచ్చం బయట దొరికే విధంగా ఉండే బఠాణీ చాట్ తయారవుతుంది. బయట అపరిశుభ్ర వాతావరణంలో తినడానికి బదులుగా దీనిని మనం ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.