Bathani Guggillu : మనం పచ్చి బఠాణీలతో పాటు ఎండు బఠాణీలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎండు బఠాణీలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. బరువు తగ్గడంలో, రక్తహీనతను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి మనకు ఎంతో దోహదపడతాయి. బఠాణీలతో మనం ఎక్కువగా చాట్ ను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వివిధ రకాల వంటకాల్లో వాడుతూ ఉంటాం. అలాగే ఈ బఠాణీలతో మనం గుగ్గిళ్లను కూడా తయారు చేసుకోవచ్చు. బఠాణీలతో చేసే గుగ్గిళ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా సులభం. ఈ గుగ్గిళ్లను తినడం వల్ల మనం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. బఠాణీలతో రుచిగా గుగ్గిళ్లను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బఠాణీ గుగ్గిళ్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు బఠాణీలు – ఒకటిన్నర కప్పులు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 3, తరిగిన పచ్చిమిర్చి – 3, కరివేపాకు – ఒ క రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్.
బఠాణీ గుగ్గిళ్ల తయారీ విధానం..
ముందుగా బఠాణీలను గిన్నెలో వేసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత వీటిని కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత వీటిని వడకట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉడికించిన బఠాణీలు వేసి కలపాలి. తరువాత ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిని తడి పోయేంత వరకు వేయించిన తరువాత కారం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బఠాణీ గుగ్గిళ్లు తయారవుతాయి. సాయంత్రం సమయాల్లో ఇలా బఠాణీలతో గుగ్గిళ్లను తయారు చేసుకుని స్నాక్స్ గా తినవచ్చు. ఈ గుగ్గిళ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా బఠాణీలతో గుగ్గిళ్లను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.