Beerakaya Munakkaya Kura : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో బీరకాయలు ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే మనం మునక్కాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. బీరకాయ, మునక్కాయలతో విడివిడిగా కాకుండా వీటితో కలిపి కూడా మనం కూరను తయారు చేసుకోవచ్చు. బీరకాయ అలాగే మునక్కాయలను కలిపి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎంతో సులభంగా తయారు చేసుకోగలిగే బీరకాయ మునక్కాయ కూరను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ మునక్కాయ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన మునక్కాయలు – 3, చిన్న ముక్కలుగా తరిగిన బీరకాయలు – కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, సాంబార్ కారం – ఒక టేబుల్ స్పూన్.
బీరకాయ మునక్కాయ కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకు వేగిన తరువాత మునక్కాయ ముక్కలు వేసి కలపాలి. తరువాత వాటిపై మూత పెట్టి మునక్కాయ ముక్కలను మగ్గించాలి. మునక్కాయ ముక్కలు మగ్గిన తరువాత బీరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత దానిపై మూతను ఉంచి బీరకాయ ముక్కలను మెత్తగా ఉడికించాలి. బీరకాయ ముక్కలు ఉడికిన తరువాత వాటిలో ఉండే నీరంతా పోయే వరకు ఉడికించాలి.
కూర దగ్గర పడిన తరువాత సాంబార్ కారం వేసి కలపాలి. తరువాత దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ మునక్కాయ కూర తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.