Beerakaya Pottu Fry : బీరకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా బీరకాయలను వాటిపై ఉండే చెక్కను తీసేసి మనం కూరగా వండుకుని తింటూ ఉంటాం. బీరకాయ చెక్కను పడేస్తూ ఉంటాం. అయితే కొందరు ఈ బీరకాయ పొట్టుతో రుచిగా పచ్చడి కూడా చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. కేవలం పచ్చడే కాకుండా ఈ బీరకాయ చెక్కుతో మనం ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా తయారు చేసుకోవచ్చు. బీరకాయ పొట్టు ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైను తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, కమ్మగా బీరకాయ పొట్టు ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ పొట్టు ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
బీరకాయ పొట్టు – అరకిలో బీరకాయల నుండి తీసినంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 5 లేదా తగినన్ని, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్.
బీరకాయ పొట్టు ఫ్రై తయారీ విధానం..
ముందుగా బీరకాయలను కడిగి వాటిపై ఉండే పొట్టును తీసుకోవాలి. తరువాత ఈ పొట్టును జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పొట్టు నుండి నీటిని పిండేసి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ముందుగా సిద్దం చేసుకున్న బీరకాయ పొట్టును వేసి కలపాలి. ఇందులో ఉప్పు, పసుపు వేసి కలపాలి. దీనిని కలుపుతూ రంగు మారే వరకు చక్కగా వేయించాలి. బీరకాయ పొట్టు వేగి దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ పొట్టు ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బీరకాయ పొట్టును పడేయకుండా దానితో రుచిగా ఇలా ఫ్రైను కూడా తయారు చేసుకుని తినవచ్చు.