Gas Trouble : మనల్ని వేధించే జీర్ణ సంబంధింత సమస్యల్లో పొట్టలో గ్యాస్ సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. గ్యాస్ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, ఆహారాన్ని నమలకపోవడం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం, మలబద్దకం, తరచూ ఆహారాన్ని తీసుకోవడం అలాగే మసాలా ఆహారాన్ని, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. పొట్టలో గ్యాస్ సమస్య కారణంగా కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి, ఛాతిలో నొప్పి, ఆకలి లేకపోవడం, ఏది తినాలనిపించకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
గ్యాస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక ఈ సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది గ్యాస్ ను నివారించే మందులను, టానిక్ లను, పొడులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల సమస్య తగ్గినప్పటికి వీటిని దీర్ఘకాలం పాటు వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఎదురవుతాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా కేవలం ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ చిట్కాలను పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా వాడవచ్చు. పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గించే ఈ చిట్కాలు ఏమిటి.. వీటిని ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సమస్యను తగ్గించడంలో మనకు వాము ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ వాము పొడిని వేసి కలపాలి. గ్యాస్ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలా తయారు చేసుకున్న నీటిని తాగాలి. ఇలా వాము నీటిని తాగడం వల్ల మనం గ్యాస్ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అదే విధంగా ధనియాలు కూడా గ్యాస్ సమస్యను తగ్గించడంలో మనకు ఎంతో దోహదపడతాయి. ముందుగా ధనియాలను వేయించాలి. తరువాత వాటిని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కలపాలి. ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే తాగాలి. ఇలా తాగడం వల్ల గ్యాస్ సమస్య తలెత్తకుండా ఉంటుంది. అలాగే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడే వారు అల్లం కషాయాన్ని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
భోజనం చేసిన తరువాత నీటిలో అల్లం ముక్కలను వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల లేదా భోజనం చేసిన తరువాత అల్లం ముక్కలను ఉప్పుతో కలిపి నమిలి మింగడం వల్ల కూడా గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ఈవిధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా పొట్టలో గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.