Bellam Appalu : బెల్లం అప్పాలు.. ఈ అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని రుచిచూసే ఉంటారు. అలాగే నైవేద్యంగా కూడా వీటిని సమర్పిస్తూ ఉంటారు. బెల్లం అప్పాలు చాలా రుచిగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. వంటరాని వారు కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. పాకం పట్టే అవసరం కూడా ఉండదు. పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఈ బెల్లం అప్పాలను, కమ్మగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – అర కప్పు, బియ్యంపిండి – అర కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, బెల్లం – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బెల్లం అప్పాల తయారీ విధానం..
ముందుగా గిన్నెలో గోధుమపిండి, బియ్యంపిండి, యాలకుల పొడి వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో నీళ్లు పోసి వేడిచేయాలి. ఇందులోనే బెల్లం వేసి కలపాలి. బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తరువాత మంటను చిన్నగా చేసి పిండి వేసి కలపాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి అంతా కలిసేలా కలుపుకుని చల్లారనివ్వాలి. తరువాత చేత్తో ఉండలు లేకుండా బాగా వత్తుకోవాలి. తరువాత చేతులకు నెయ్యి రాసుకుంటూ పిండి తీసుకుని అప్పాలుగా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అప్పాలు వేసి అలాగే ఉంచాలి. రెండు నిమిషాల తరువాత అటూ ఇటూ తిప్పుతూ మధ్యస్థ మంటపై లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తరువాత మంటను పెద్దగా చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం అప్పాలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా చాలా సులభంగా, రుచిగా బెల్లం అప్పాలను తయారు చేసి తీసుకోవచ్చు.