Bellam Bondalu : బెల్లంతో మనం రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెల్లంతో చేసే వంటకాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బెల్లంతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో బెల్లం బోండాలు కూడా ఒకటి. ఈ బోండాలు చాలా రుచిగా ఉంటాయి. గోధుమపిండి, బెల్లం కలిపి చేసే ఈ బోండాలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పూర్వకాలం నుండి వీటిని తయారు చేస్తున్నారు. వీటిని అరగంటలోపే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే బెల్లం బోండాలను సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం బోండా తయారీకి కావల్సిన పదార్థాలు..
బెల్లం – 200 గ్రా., నీళ్లు – పావు లీటర్, గోధుమపిండి – అర కిలో, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, బొంబాయి రవ్వ – ఒకటిన్నర టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బెల్లం బోండాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బెల్లం తురుమును తీసుకోవాలి. తరువాత ఇందులో నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, వంటసోడా, రవ్వ వేసి కలపాలి. తరువాత వడకట్టిన బెల్లం నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ బోండా పిండిలాగా జారుడుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత దీనిపై మూతను ఉంచి 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి.
తరువాత దీనిని అంతా కలిసేలా మరోసారి కలుపుకుని కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మంటను మధ్యస్థంగా చేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బోండాలను వేసుకోవాలి. వీటిని అటు ఇటూ కదుపుతూ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం బోండాలు తయారవుతాయి. ఈ విధంగా తీపి తినాలనిపించినప్పుడు బెల్లంతో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా బోండాలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ బెల్లం బోండాలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.