Bellam Gavvalu : బెల్లం గ‌వ్వ‌ల‌ను ఇలా చేస్తే.. అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు..

Bellam Gavvalu : బెల్లం గ‌వ్వ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. ఈ గ‌వ్వ‌లు ఎంతో రుచిగా ఉంటాయి. బెల్లం గ‌వ్వ‌లు మ‌న‌కు బ‌య‌ట కూడా ల‌భ్య‌మ‌వుతాయి. వీటిని తయారు చేయ‌డానికి ఎక్కువ‌గా మైదా పిండిని, డాల్డాను ఉప‌యోగిస్తారు. ఇవి రెండు కూడా మ‌న ఆరోగ్యానికి హాని చేసేవే. ఈ బెల్లం గ‌వ్వ‌ల‌ను రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా, అలాగే క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం గ‌వ్వ‌ల త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

గోధుమ పిండి – ఒక‌టిన్న‌ర క‌ప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – అర టీ స్పూన్, వంట‌సోడా – పావు టీ స్పూన్, నీళ్లు – అర క‌ప్పు లేదా త‌గిన‌న్ని, నూనె – డీప్ ఫ్రై కి స‌రిప‌డా, బెల్లం తురుము – ముప్పావు క‌ప్పు.

Bellam Gavvalu very tasty how to make them
Bellam Gavvalu

బెల్లం గ‌వ్వ‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకుని అందులో నెయ్యి, ఉప్పు, వంట‌సోడా వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత నీళ్ల‌ను పోసి పిండి మ‌రీ గ‌ట్టిగా, మ‌రీ మెత్త‌గా కాకుండా క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 10 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత పిండిని మ‌రోసారి బాగా క‌లిపి చిన్న చిన్న ముద్ద‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు గ‌వ్వ‌లు చేసే పీట‌ను తీసుకుని గవ్వ‌లుగా చుట్టుకోవాలి. గ‌వ్వ‌లు చేసే పీట లేని వారు ఫోర్క్ లేదా గీత‌లు గీత‌లుగా ఉండే జ‌ల్లిగంటె స‌హాయంతో కూడా గవ్వ‌ల‌ను చుట్టుకోవ‌చ్చు.

ఇలా గ‌వ్వ‌ల‌న్నీ చుట్టుకున్న త‌రువాత మందంగా ఉండే క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక గ‌వ్వ‌ల‌ను వేసి వేయించుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై కలుపుతూ ఎర్ర‌గా అయ్యి క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్ని గ‌వ్వ‌ల‌ను వేయించుకున్న త‌రువాత ఒక క‌ళాయిలో బెల్లం తురుము, అర క‌ప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగిన త‌రువాత ఆ నీటిని వ‌డ‌క‌ట్టుకుని మ‌ర‌లా అదే క‌ళాయిలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీటిని లేత పాకం కంటే కొద్దిగా ఎక్కువ‌గా పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి.

ఇలా ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ముందుగా సిద్దం చేసుకున్న గ‌వ్వ‌ల‌ను వేసి క‌లుపుకోవాలి. బెల్లమంతా గ‌వ్వ‌ల‌కు ప‌ట్టేలా బాగా క‌లిపి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ప‌క్క‌కు ఉంచాలి. ఇవి పూర్తిగా చ‌ల్ల‌గా అయిన త‌రువాత వీటిని వేరు చేస్తూ డ‌బ్బాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి. గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వల్ల ఈ గ‌వ్వ‌లు నెల‌రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే బెల్లం గ‌వ్వ‌లు త‌యార‌వుతాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు. చిరుతిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే బెల్లం గ‌వ్వ‌ల‌ను త‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌వ‌చ్చు.

D

Recent Posts