Bellam Pongadalu : బెల్లం పొంగడాలు.. ఎంతో రుచిగా ఉండే ఈ తీపి వంటకం గురించి ప్రత్యేకంగాచెప్పవలసిన పని లేదు. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఎక్కువగా పండుగలకు ఈ పొంగడాలను తయారు చేస్తూ ఉంటారు. వీటిని తయారు చేయడం చాలా సులభం. మొదటి సారి చేసే వారు కూడా చాలా సులభంగా చేసుకునేలా, రుచిగా, చక్కగా ఈ బెల్లం పొంగడాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం పొంగడాల తయారీకి కావల్సిన పదార్థాలు..
దొడ్డు బియ్యం – ఒకటిన్నర గ్లాస్, బెల్లం తురుము – ఒక గ్లాస్, నీళ్లు – పావు గ్లాస్, యాలకుల పొడి – అర టీ స్పూన్, వంటసోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బెల్లం పొంగడాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుని 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని మధ్యమధ్యలో కడుగుతూ నీళ్లు పోసుకుంటూ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తరువాత బియ్యాన్ని ఒక జల్లిగిన్నెలోకి తీసుకుని నీళ్లు అన్నీ పోయేలా చేసుకోవాలి. తరువాత ఈబియ్యాన్ని కొద్ది కొద్దిగా జార్ లో వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని మరలా జల్లించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో బెల్లం తురుము, నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే యాలకుల పొడి వేసుకుని కలపాలి. ఈ బెల్లాన్ని లేత ముదురు పాకం వచ్చే వరకు వేడి చేయాలి. బెల్లం మిశ్రమాన్ని నీటిలో వేసి చూస్తే మెత్తని ఉండలాగా అవ్వాలి. ఇలా బెల్లం పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి వెంటనే దీనిలో తగినంత బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి.
ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని మరీ గట్టిగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకున్న తరువాత దీనిలో పావు గ్లాస్ నుండి అర గ్లాస్ నీళ్లను పోసి అట్టు పిండిలాగా చిక్కగా కలుపుకోవాలి. తరువాత ఇందులో వంటసోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉండే కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక గంటెతో పిండిని తీసుకుని పొంగడాలను వేసుకోవాలి. ఇవి కాలిన తరువాత వాటంతట అవే పైకి తేలుతాయి. ఈ పొంగడాలను రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం పొంగడాలు తయారవుతాయి. పండుగలకు, ప్రత్యేక సందర్భాల్లో ఇలా బెల్లం పొంగడాలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తినడం వల్ల రుచితో పాటు శరీరం కూడా బలంగా తయారవుతుంది.