Bendakaya Kura : బెండ‌కాయ‌ల‌తో ఒక్క‌సారి ఇలా కూర చేయండి చాలు.. ఇంటిల్లిపాదీ లాగించేస్తారు..!

Bendakaya Kura : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ‌లు కూడా ఒక‌టి. బెండ‌కాయ‌ల‌ను చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌నం ఎక్కువ‌గా బెండ‌కాయ‌ల‌తో వేపుడు, పులుసు వంటి వాటినే త‌యారు చేస్తాము. కానీ బెండ‌కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే ఈ బెండ‌కాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వంట‌రాని వారు, బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు ఇలా ఎవ‌రైనా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ బెండ‌కాయ కూర‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బెండ‌కాయ కూర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బెండ‌కాయ‌లు – పావుకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – చిటికెడు, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి) , అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ప‌చ్చిమిర్చి – 2, ట‌మాటాలు – 2 ( మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ఉప్పు – త‌గినంత, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ఒక గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

Bendakaya Kura recipe in telugu very tasty
Bendakaya Kura

బెండ‌కాయ కూర త‌యారీ విధానం..

ముందుగా బెండ‌కాయ‌ల‌ను శుభ్రంగా క‌డిగి త‌గి లేకుండా తుడుచుకోవాలి. త‌రువాత వీటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత బెండ‌కాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని రెండు నుండి మూడు నిమిషాల పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించిన త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి. త‌రువాత దీనిని అంతా క‌లుపుకున్న త‌రువాత మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి.

త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, గ‌రం మ‌సాలా, జీల‌క‌ర్ర పొడి, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి పెరుగు వేసి క‌ల‌పాలి. పెరుగు పూర్తిగా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత వేయించిన బెండ‌కాయ ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి చిన్న మంట‌పై నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. బెండ‌కాయ‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts