Bendakaya Pulusu : బెండకాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసుకోదగిన వంటకాల్లో బెండకాయ పులుసు కూడా ఒకటి. బెండకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అలాగే ఒక్కో విధంగా ఈ బెండకాయ పులుసును తయారు చేస్తూ ఉంటాము. కింద చెప్పిన విధంగా తయారు చేసే బెండకాయ పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. తరుచూ చేసే బెండకాయ పులుసు కంటే ఈ విధంగా తయారు చేసే బెండకాయ పులుసు మరింత రుచిగా ఉంటుంది. మరింత రుచిగా, కమ్మగా బెండకాయ పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – 200 గ్రా., పేస్ట్ లాగా చేసిన టమాటాలు – 2, నానబెట్టిన చింతపండు – చిన్న నిమ్మకాయంత, నూనె – ఒక టేబుల్ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 2, వెల్లుల్లి రెమ్మలు – 4, ఇంగువ – పావు టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన ఉల్లిపాయ – 1, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, పసుపు- పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, మ్యాగీ మసాలా ఎ మ్యాజిక్ – ఒక సాచెట్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బెండకాయ పులుసు తయారీ విధానం..
ముందుగా బెండకాయలను పొడవుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత బెండకాయ ముక్కలు వేసి 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న టమాట ఫ్యూరీ వేసి కలపాలి. తరువాత శనగపిండి వేసి కలపాలి.
దీనిని బాగా వేయించిన తరువాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత వేయించిన బెండకాయలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించిన తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. ముక్కలు మెత్తగా ఉడికి పులుసు దగ్గర పడిన తరువాత మ్యాగీ మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బెండకాయ పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.