Bendakaya Sambar : మనం బెండకాయలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బెండకాయలతో రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటాము. బెండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. బెండకాయలతో మనం ఎక్కువగా వేపుడు, పులుసు, కూర వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా బెండకాయలతో మనం సాంబార్ ను కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయ సాంబార్ ను పూర్వకాలంలో ఎక్కువగా తయారు చేసేవారు. పప్పు ఉడకబెట్టే పని లేకుండా ఈ సాంబార్ ను అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. బెండకాయలతో ఎంతో రుచిగా, కమ్మగా ఉండే సాంబార్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ సాంబార్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – 15 నుండి 20, నానబెట్టిన చింతపండు – 20 గ్రా., పొడవుగా తరిగిన ఉల్లిపాయ – 1, పొడవుగా తరిగిన క్యారెట్ – 1, తరిగిన పచ్చిమిర్చి – 10, నూనె – 2 టేబుల్ స్పూన్స్, మెంతులు – పావు టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, ఎండుమిర్చి – 4, ఉప్పు – తగినంత, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – రెండున్నర గ్లాసులు, శనగపిండి – 2 టీ స్పూన్స్, సాంబార్ పొడి – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

బెండకాయ సాంబార్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతులు, తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, బెండకాయ ముక్కలు వేసి 4 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించాలి. తరువాత మంటను మధ్యస్థంగా చేసి ఉప్పు వేసి కలపాలి. తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఈ సాంబార్ ను మరిగించాలి. సాంబార్ మరుగుతుండగానే మరో గిన్నెలో శనగపిండిని తీసుకుని ముందుగా కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత పావు కప్పు నీళ్లు పోసి పలుచగా కలుపుకోవాలి.
తరువాత సాంబార్ పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. ఈ సాంబార్ ను మరో 5 నిమిషాల పాటు మరిగించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ సాంబార్ తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా సాంబార్ తయారు చేసుకుంటే చాలు కూర లేకపోయినప్పటికి సాంబార్ తోనే కడుపు నిండా భోజనం చేయవచ్చు.