Besan Barfi Recipe : శనగపిండితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. దీనితో చిరుతిళ్లతో పాటు తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. శనగపిండితో చేసుకోదగిన తీపి వంటకాల్లో బేసన్ బర్ఫీ కూడా ఒకటి. ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ బేసన్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బేసన్ బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – 2 కప్పులు, పంచదార – ఒకటిన్నర కప్పు, నీళ్లు – ఒక కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, ఎల్లో ఫుడ్ కలర్ – చిటికెడు, యాలకుల పొడి – అర టీ స్పూన్, తరిగిన డ్రైఫ్రూట్స్ – కొద్దిగా.
బేసన్ బర్ఫీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పంచదారను, నీళ్లును పోసి వేడి చేయాలి. పంచదార కరిగి తీగ పాకం వచ్చే వరకు దీనిని ఉడికించాలి. పంచదార మిశ్రమం తయారవుతుండగానే మరో స్టవ్ మీద మందపాటి కళాయిని అందులో నెయ్యిని పోసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తరువాత అందులో శనగపిండి వేసి కలపాలి. ఈ శనగపిండిని చిన్న మంటపై 20 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. శనగపిండి మెత్తగా అయిన తరువాత ఇందులో ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత తీగ పాకం వచ్చిన పంచదార మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి. పంచదార మిశ్రమం, శనగపిండి పూర్తిగా కలిసే వరకు అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుతూ వేయించడం వల్ల కొద్ది ఏపటి తరువాత దీనిని బుడగలు రావడం ప్రారంభమవుతుంది.
ఇలా బుడగలు రాగానే బర్ఫీ తయారయ్యిందిగా భావించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని అర ఇంచు మందం ఉండేలా వత్తుకుని పైన సమానంగా చేసుకోవాలి. తరువాత దీనిపై డ్రై ఫ్రూట్స్ ను చల్లి కొద్దిగా లోపలికి వత్తుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారే వరకు ఉంచి తరువాత కావల్సిన ఆకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉండే బేసన్ బర్ఫీ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా శనగపిండితో బర్ఫీని తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.