Biryani Masala Curry : మనం వంటింట్లో రకరకాల బిర్యానీలను, పులావ్ లను తయారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. వీటిని తినడానికి మనం మసాలా కర్రీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. మసాలా కర్రీతో తింటే బిర్యానీ, పులావ్ ల రుచి మరింత పెరుగుతుంది. బిర్యానీ, పులావ్ వంటి వాటిని తినడానికి మనం ఎక్కువగా పచ్చి మిర్చి మసాలా కర్రీని తయారు చేస్తూ ఉంటాం. పచ్చి మిర్చి మసాలా కర్రీ నే కాకుండా మనం ఉల్లిపాయలతో కూడా బిర్యానీలోకి మసాలా కర్రీని తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలతో చేసే ఈ మసాలా కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. బిర్యానీ, పులావ్ లలోకి ఉల్లిపాయలతో మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బిర్యానీ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – పావు కప్పు, నువ్వులు – పావు కప్పు, గసగసాలు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూన్, పెద్దగా తరిగిన ఉల్లిపాయ – 1(పెద్దది) , నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక చిన్న గ్లాస్, చింతపండు గుజ్జు – 20 గ్రాములు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
బిర్యానీ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పల్లీలను వేసి చిన్న మంటపై వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత నువ్వులను, గసగసాలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఎండు కొబ్బరిని వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత వీటన్నింటనీ ఒక జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత ఆవాలను, జీలకర్రను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయలను, కరివేపాకును వేసి ఉల్లిపాయలు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
తరువాత పసుపు, కారం, ధనియాల పొడి , గరం మసాలా వేసి కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ ను వేసి కలుపుకోవాలి. తరువాత ఒక గ్లాస్ నీళ్లను పోసి కలిపి మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తరువాత చింతపండు గుజ్జును వేసి కలిపి మరలా మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బిర్యానీ మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని బిర్యానీ, పులావ్ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.