Bitter Gourd Fry : చేదుగా ఉండే కూరగాయ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కాకరకాయ. దీనిని కూడా మనం ఆహారంగా తీసుకుంటాం. కానీ కాకరకాయ చేదుగా ఉంటుంది కనుక దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కాకరకాయలో కూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని దీనిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయతో ఎక్కువగా చేసే వంటకాల్లో కాకరకాయ వేపుడు కూడా ఒకటి. ఈ కాకర కాయ వేపుడును చేదు లేకుండా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకర కాయలు – పావు కిలో, ఎండుమిర్చి – 6 లేదా 8, ఎండుకొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 10, ఉప్పు – తగినంత, నూనె – 3 టేబుల్ స్పూన్స్.
కాకరకాయ వేపుడు తయారీ విధానం..
ముందుగా కాకరకాయలపై ఉండే చెక్కును తీసేసి శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని సన్నగా గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. కాకరకాయపై చెక్కును తీసివేయడం వల్ల కాకకాయ చేదు తగ్గతుంది. తరువాత ఒక కళాయిలో ఎండుమిర్చిని, ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత జీలకర్ర, నువ్వులు వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి అన్నీ కూడా చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలను వేసి మధ్యస్థ మంటపై వేయించుకోవాలి. వీటిని మాడిపోకుండా కలుపుతూ కరకరలాడే వరకు వేయించాలి. కాకరకాయ ముక్కలు వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేదు లేకుండా ఎంతో రుచిగా ఉండే కాకరకాయ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయ చేదుగా ఉంటుంది అనే కారణం చేత దీనిని తినని వారు ఇలా వేపుడును చేసుకుని తినడం వల్ల కాకరకాయ వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.