Biyyam Payasam : పాలతో మనం రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. పాలతో చేసే తీపి వంటకాలు ఎంతగా రుచిగా ఉంటాయో మనందరికి తెలిసిందే. పాలతో తయారు చేసుకోదగిన వంటకాల్లో రైస్ కీర్ కూడా ఒకటి. ఈ కీర్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ కీర్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లలు కూడా చాలా సులభంగా తయారు చేయగలరు. రుచిగా ఉండడంతో పాటు తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే ఈ రైస్ కీర్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రైస్ కీర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన బియ్యం – ముప్పావు కప్పు, పంచదార – ముప్పావు కప్పు, పాలు – ఒక లీటర్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండు ద్రాక్ష – ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్, కండెన్స్డ్ మిల్క్ – 2 టేబుల్ స్పూన్స్.
రైస్ కీర్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పాలను పోసి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. తరువాత ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. బియ్యం ఉడికి పాలు కొద్దిగా దగ్గర పడిన తరువాత పంచదార వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల పంచదారను, 2 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి వేడి చేయాలి. పంచదార కరిగి క్యారమెల్ లాగా అయ్యే వరకు వేడి చేయాలి. ఇలా తయారు చేసుకున్న పంచదార మిశ్రమాన్ని ఉడికించిన కీర్ లో వేసి కలపాలి.
ఇలా చేయడం వల్ల కీర్ చక్కటి రంగు వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి యాలకు పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, కండెన్స్డ్ మిల్క్ వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. దీనిని మరో నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కమ్మటి రుచిని కలిగి ఉండే రైస్ కీర్ తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు అలాగే ఇంటికి అతిధులు వచ్చినప్పుడు ఇలా పాలతో రైస్ కీర్ ను తయారు చేసుకుని తినవచ్చు.