Bread Halwa : మిల్క్ బ్రెడ్‌ను ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటుంటారు. దీంతో కొన్ని వంటలను కూడా చేస్తుంటారు. పాలలో వీటిని ముంచుకుని తింటే భలే రుచిగా ఉంటాయి. అలాగే టోస్ట్‌లా చేసి తిన్నా బాగానే ఉంటాయి. కొందరు వీటితో డబుల్ కా మీఠా చేస్తుంటారు. అయితే ఇదే బ్రెడ్‌తో హల్వా కూడా చేయవచ్చు. అది ఎంతో రుచిగా ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేయాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
మిల్క్ బ్రెడ్ – 10, నూనె – డీ ఫ్రై కి సరిపడా, నెయ్యి – ఒక టీ స్పూన్, పంచదార – 300 గ్రా., కచ్చా పచ్చాగా చేసిన యాలకులు – 4 లేదా 5, జీడి పప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండు ద్రాక్ష – ఒక టేబుల్ స్పూన్, బాదంపప్పు ముక్కలు – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – ఒక గ్లాసు, కాచి చల్లార్చిన పాలు – ఒక చిన్న గ్లాసు.
బ్రెడ్ హల్వా తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ ను తీసుకుని నాలుగు వైపులా నల్లగా ఉండే అంచులని తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి కాగాక ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి ఎక్కువ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత మరో కళాయిలో నెయ్యి వేసి కాగాక డ్రై ఫ్రూట్స్ ను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పంచదార, నీళ్లను, యాలకులను వేసి కలుపుకోవాలి.
బ్రెడ్ హల్వా తయారీకి పంచదారను పాకం వచ్చే వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. పంచదార కరిగి నీళ్లు కొద్దిగా మరిగిన తరువాత చిన్న మంటపై వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేయాలి. బ్రెడ్ ముక్కలు నానిన తరువాత అంతా కలిసిపోయేలా బ్రెడ్ ముక్కలుగా లేకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత పాలను పోసి కలిపి.. 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ హల్వా తయారవుతుంది. తీపి పదార్థాలను తినాలనిపించినప్పుడు బ్రెడ్ తో చాలా సులభంగా, త్వరగా ఇలా హల్వాను చేసుకుని తినవచ్చు.