Bread Manchuria : బ్రెడ్ తో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. అయితే తరుచూ చేసే వంటకాలతో పాటు బ్రెడ్ తో మనం ఎంతో రుచిగా ఉండే మంచురియాను కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో తయారు చేసే ఈ మంచురియా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. బ్రెడ్ మంచురియాను తయారు చేయడం చాలా సులభం. తరుచూ ఒకేరకం మంచురియా తిని తిని బోర్ కొట్టిన వారు ఇలా వెరైటీగా కూడా ట్రై చేయవచ్చు. బ్రెడ్ తో రుచికరమైన మంచురియాను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ మంచూరియా తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రెడ్ స్లైసెస్ – 3, క్యారెట్ – చిన్నది ఒకటి, క్యాబేజి – చిన్నది ఒకటి, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
టాసింగ్ కు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒక టేబుల్ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి- 2, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం తరుగు – అర టీ స్పూన్, లైట్ సోయా సాస్ – అర టీ స్పూన్, వెనిగర్ – ఒక టీ స్పూన్, టమాట కిచప్ – ఒక టేబుల్ స్పూన్, చైనీస్ చిల్లీ పేస్ట్ లేదా షెజ్వాన్ సాస్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 50 ఎమ్ ఎల్, ఉప్పు – కొద్దిగా, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, నల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, అరోమేటిక్ పౌడర్ – అర టీ స్పూన్, పంచదార – చిటికెడు, స్ప్రింగ్ ఆనియన్స్ – ఒక టేబుల్ స్పూన్.
బ్రెడ్ మంచూరియా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బ్రెడ్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. తరువాత క్యారెట్ ను, క్యాబేజిని సన్నగా తురిమి వేసుకోవాలి. తరువాత నీళ్లు పోయకుండా క్యాబేజిలో ఉండే నీటితోనే అంతా కలిసేలా కలుపుకోవాలి. అవసరమైతే ఒక టీ స్పూన్ నీటిని మాత్రమే పోయాలి. బ్రెడ్, క్యారెట్, క్యాబేజిని ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత ఉప్పు వేసి కలపాలి. తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాత ఉండలను వేసి మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత టాసింగ్ కు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు వేసి పెద్ద మంటపై వేయించాలి.
ఇవి వేగిన తరువాత లైట్ సోయాసాస్, వెనిగర్, టమాట కిచప్, చైనీస్ చిల్లీ సాస్ వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి ఉడికించాలి. నీళ్లు మరిగిన తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు ఉడికించిన తరువాత వేయించిన మంచురియా వేసి కలపాలి. సాసెస్ అన్ని మంచురియాకు పట్టిన తరువాత పైన స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ మంచురియా తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన బ్రెడ్ మంచురియాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు వీటిని మరింత ఇష్టంగా తింటారు.