Bread Pakoda : మనం తయారు చేసే చిరుతిళ్లల్లో పకోడాలు ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మన అభిరుచికి తగినట్టుగా మనం రకరకాల రుచుల్లో ఈ పకోడాలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకోగలిగే పకోడాలలో బ్రెడ్ పకోడా కూడా ఒకటి. బ్రెడ్ పకోడా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. మనకు రోడ్ల పక్కన బండ్ల మీద కూడా ఈ బ్రెడ్ పకోడా లభిస్తూ ఉంటుంది. ఈ బ్రెడ్ పకోడాను స్ట్రీట్ స్టైల్ లో రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలసుకుందాం.
బ్రెడ్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపిండి – ఒక కప్పు, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్స్, కారం – అర టీ స్పూన్, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – పావు టీ స్పూన్, వంటసోడా – రెండు చిటికెలు, జీలకర్ర – అర టీ స్పూన్, బ్రెడ్ స్టైసెస్ – 6, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పుదీనా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన పుదీనా – ఒక కట్ట, తరిగిన కొత్తిమీర – ఒక కట్ట, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి – 4, జీలకర్ర – అర టీ స్పూన్, నీళ్లు – కొద్దిగా.
బ్రెడ్ పకోడాను తయారు చేసే విధానం..
ముందుగా ఒక జార్ లో పుదీనా పేస్ట్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత బ్రెడ్ స్లైసెస్ కు ఉండే అంచులను తీసేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ గంటె జారుడుగా బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్టైసెస్ ఆరింటిని తీసుకుని వాటికి ఒక వైపు ఒక టీ స్పూన్ మోతాదులో మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ ను రాయాలి. తరువాత ఈ బ్రెడ్ స్లైసెస్ ను పుదీనా పేస్ట్ రాసిన వైపు లోపలికి వచ్చేలా ఒక దాని మీద ఒకటి వేసుకోవాలి.
తరువాత చాకుతో వీటిని త్రిభుజాకారంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కట్ చేసిన బ్రెడ్ ను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ పకోడా తయారవుతుంది. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. బ్రెడ్ తో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పకోడాలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. వీటిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.