Bread Potato Rolls : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అయితే బంగాళాదుంపలతో తరచూ చేసే ఈ స్నాక్స్ ను తిని తిని బోర్ కొట్టిన వారు వెరైటీగా ఉండే ఈ బ్రెడ్ పొటాటో రోల్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ రోల్స్ కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. బంగాళాదుంపలతో ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ పొటాటో రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ పొటాటో రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 2, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, బ్రెడ్ స్లైసెస్ – 5, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బ్రెడ్ పొటాటో రోల్స్ తయారీ విధానం..
ముందుగా బంగాళాదుంపలను మెత్తగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత మెత్తగా చేసుకున్న బంగాళాదుంపలను, కొత్తిమీరను వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని పూర్తిగా చల్లారే వరకు పక్కకు ఉంచాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కు చుట్టూ ఉండే అంచులను తీసివేయాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ను నీటిలో ముంచి తీయాలి. తరువాత రెండు చేతులతో నెమ్మదిగా వత్తుతూ ఎక్కువగా ఉండే నీటిని తీసి వేయాలి.
తరువాత ఈ బ్రెడ్ స్లైస్ మధ్యలో బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచి నెమ్మదిగా అంచులను మూసి వేస్తూ రోల్ లాగా చుట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రోల్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ పొటాటో రోల్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో ఇలా రుచిగా అలాగే త్వరగా అయ్యే ఈ బ్రెడ్ పొటాటో రోల్స్ ను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.