Brinjal Tomato Pappu : మనం తరచూ టమాట పప్పును తయారు చేస్తూ ఉంటాం. టమాట పప్పు ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నంలో టమాట పప్పుతోపాటు నెయ్యిని కొద్దిగా వేసి కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మనం తరచూ చేసే టమాట పప్పులో వంకాయలను వేసి వంకాయ టమాట పప్పును కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇక వంకాయ టమాట పప్పును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ టమాట పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
కంది పప్పు – ఒక కప్పు, టమాటాలు – 3, వంకాయలు – 6, పచ్చి మిరపకాయలు – 10, చింతపండు – కొద్దిగా, నీళ్లు – తగినన్ని, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 6, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, ఎండు మిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ టమాట పప్పు తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో కంది పప్పును వేసి శుభ్రంగా కడగాలి. తరువాత టమాటలను, వంకాయలను శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా చేసి కుక్కర్ లో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి మిరపకాయలను కూడా ముక్కలుగా చేసి వేయాలి. వీటితోపాటుగా రుచికి సరిపడా ఉప్పు, పసుపు, చింతపండు వేసి, తగినన్ని నీళ్లను పోసి మూత పెట్టి 3 విజిల్స్ వ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తరువాత మూత తీసి పప్పును గరిటె లేదా పప్పు గుత్తి సహాయంతో మెత్తగా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో నూనె వేసి నూనె కాగాక తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. తాళింపు వేగాక ముందుగా మెత్తగా చేసి పెట్టుకున్న పప్పును వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాట పప్పు తయారవుతుంది. అన్నం, చపాతీ, పుల్కా, రాగి సంగటి వంగి వాటితో ఈ పప్పును కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.