Pesara Pappu Halwa : మనం తరచూ వంటింట్లో పెసర పప్పును ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. మన శరీరంలో ఉండే వేడిని తగ్గించే గుణం పెసర పప్పుకు ఉంది. ఇతర పప్పుల కంటే కూడా పెసర పప్పు చాలా త్వరగా జీర్ణమవుతుంది. పెసర పప్పులో పోషకాలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో పెసర పప్పు ఎంతో సహాయపడుతుంది. పెసర పప్పును తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల హార్మోన్ అసమతుల్యతల వచ్చే సమస్యలు తగ్గుతాయి. మనం పెసర పప్పును ఉపయోగించి వంటలతోపాటు తీపి పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా పెసర పప్పుతో ఎంతో రుచిగా ఉండే హల్వాను కూడా తయారు చేయవచ్చు. ఇక దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పప్పు హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు – అర కప్పు, నీళ్లు – రెండున్నర కప్పులు, జీడి పప్పు – 2 టేబుల్ స్పూన్స్, బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్స్, గోధుమ పిండి – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, పుడ్ కలర్ – చిటికెడు.
పెసర పప్పు హల్వా తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో పెసర పప్పును వేసి శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లను పోసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పెసర పప్పును చల్లారిన తరువాత ఒక జార్ లో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత ఒక కళాయిలో అర కప్పు నెయ్యిని వేసి.. నెయ్యి కాగాక జీడి పప్పు, బాదం పప్పును వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే నెయ్యిలో గోధుమ పిండిని వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. తరువాత ముందుగా పేస్ట్ లా మిక్సీ పట్టుకున్న పెసర పప్పు ను వేసి కలుపుకోవాలి. తరువాత పంచదారను వేసి పంచదార పూర్తిగా కరిగే వరకు తిప్పుతూ కలుపుకోవాలి.
తరువాత మిగిలిన అర కప్పు నెయ్యి నుండి ఒక్కో స్పూన్ నెయ్యిని నుండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి మొత్తం పెసర పప్పు మిశ్రమంలో కలిసిన తరువాత యాలకుల పొడితోపాటు పుడ్ కలర్ లో కొద్దిగా నీళ్లను వేసి కలుపుకోవాలి. చివరగా వేయించి పెట్టుకున్న జీడి పప్పు, బాదం పప్పులతోపాటు మరో స్పూన్ నెయ్యిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు హల్వా తయారవుతుంది. తరచూ తయారు చేసుకునే హల్వాకు బదులుగా ఇలా పెసర పప్పుతో హల్వాను తయారు చేసుకోవడం వల్ల రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.