Cabbage Appam : క్యాబేజితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. క్యాబేజితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. తరుచూ చేసే కూరలు, చిరుతిళ్లే కాకుండా క్యాబేజితో మనం ఎంతో రుచిగా ఉండే అప్పాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. క్యాబేజితో చేసే ఈ అప్పం చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడానికి, స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. క్యాబేజిని తినని వారు కూడా ఈ అప్పాన్ని ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉండే ఈ క్యాబేజి అప్పాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి అప్పం తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యాబేజి – 200 గ్రా., జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – ఒక టేబుల్ స్పూన్, గోధుమపిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత.
క్యాబేజి అప్పం తయారీ విధానం..
ముందుగా క్యాబేజిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. తరువాత అవసరమైతే కొద్దిగా పిండిని వేసుకుని కలుపుకోవాలి. తరువాత బటర్ పేపర్ ను లేదా అరటి ఆకును లేదా ప్లాస్టిక్ కవర్ ను తీసుకుని దానికి నూనె రాయాలి. తరువాత క్యాబేజి మిశ్రమాన్ని తీసుకుని నెమ్మదిగా చేత్తో అప్పలాగా వత్తుకోవాలి. తరువాత తరువాత కళాయిలో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత అప్పం వేసి కాల్చుకోవాలి. దీనిని ఎక్కువగా తిప్పకుండా మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి అప్పం తయారవుతుంది. దీనిని నేరుగా ఇలాగే తినవచ్చు లేదా టమాట కిచప్ తో కూడా తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన క్యాబేజి అప్పాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.