Caramel Payasam : మనలో చాలా మంది సేమ్యా పాయాసాన్ని ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీనిని ఇష్టంగా తింటారు. అయితే తరుచూ ఒకేరకం సేమ్యా పాయసం కాకుండా దీనిని మరింత రుచిగా క్యారమెల్ పాయసంలాగా కూడా తయారు చేసుకోవచ్చు. క్యారమెల్ పాయసం కూడా చాలా రుచిగా ఉంటుంది. క్యాటరింగ్ వాళ్లు దీనిని ఎక్కువగా సర్వ్ చేస్తూ ఉంటారు. క్యారమెల్ పాయసాన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. చాలా తక్కువ సమయంలో దీనిని తయారు చేసుకోవచ్చు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, తీపి తినాలనిపించినప్పుడు ఈ పాయసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా ఉండే ఈ క్యారమెల్ పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారమెల్ పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, సేమ్యా – అర కప్పు, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, పాలు – అర లీటర్, పంచదార – అర కప్పు.
క్యారమెల్ పాయసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక సేమ్యా వేసి వేయించాలి. దీనిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత జీడిపప్పు వేసి వేయించాలి. సేమ్యాను గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించిన తరువాత పాలు పోసి కలపాలి. ఇప్పుడు సేమ్యాను మెత్తగా అయ్యే వరకు 15 నుండి 18 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. సేమ్యా మెత్తగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మరో కళాయిలో పంచదార, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుతూ వేడి చేయాలి. పంచదార కరిగి గోల్డెన్ కలర్ లోకి మారిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని వెంటనే కొద్ది కొద్దిగా ముందుగా తయారు చేసుకున్న పాయసంలో వేస్తూ కలపాలి. తరువాత మరో పావు కప్పు పంచదార వేసి పాయసాన్ని స్టవ్ మీద ఉంచి ఉడికించాలి. దీనిని నెయ్యి పైకి తేలే వరకు చక్కగా ఉడికించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారమెల్ పాయసం తయారవుతుంది. దీనిని చల్లగా, వేడిగా ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన క్యారమెల్ పాయసాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.