Carrot Aloo Fry : మనం వంటింట్లో కూరగాయలను ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి రెండు, మూడు కూరగాయలను కలిపి ఒకే కూరగా తయారు చేస్తూ ఉంటాం. ఇలా అన్ని రకాల కూరగాయలతో కూర చేయడానికి సాధ్యపడదు. కొన్ని రకాల కూరగాయలు మాత్రమే ఇలా చేయడానికి వీలుగా ఉంటాయి. ఈ విధంగా చేయడానికి వీలుగా ఉండే కూరగాయల్లో క్యారెట్స్, ఆలుగడ్డలు కూడా ఉన్నాయి. ఇవి రెండు కూడా మన శరీరానికి మేలు చేసేవే. మనం క్యారెట్ లను, ఆలుగడ్డలను వేరువేరుగా ఫ్రై చేస్తూ ఉంటాం. వేరువేరుగా కాకుండా వీటిని కలిపి కూడా ఫ్రై చేయవచ్చు. ఇలా చేసిన ఫ్రై కూడా చాలా రుచిగా ఉంటుంది, క్యారెట్, ఆలూ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ ఆలూ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన క్యారెట్స్ – 4, చిన్నగా తరిగిన బంగాళా దుంప – 2, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పచ్చి మిర్చి – 3, పసుపు – అర టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, శనగపప్పు – అర టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, ధనియాల పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పుట్నాల కారం – 2 టేబుల్ స్పూన్స్.
క్యారెట్ ఆలూ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప పప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత తరిగిన పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన క్యారెట్, బంగాళాదుంప, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి చిన్న మంటపై వేయించుకోవాలి. క్యారెట్, బంగాళాదుంప పూర్తిగా ఉడికిన తరువాత ఎండు కొబ్బరి పొడి, పుట్నాల కారం, ధనియాల పొడి వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఆలూ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా క్యారెట్, ఆలూ రెండింటినీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.