Carrot Beans Fry : క్యారెట్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్యారెట్ తో మనం ఇతర కూరగాయలను కూడా కలిపి వండుకుని తింటూ ఉంటాం. ఈ విధంగా క్యారెట్ తో చేసుకోదగిన వంటకాల్లో క్యారెట్ బీన్స్ ఫ్రై కూడా ఒకటి. ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. పోషకాలు ఆవిరైపోకుండా ఈ క్యారెట్ బీన్స్ ఫ్రైను రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ బీన్స్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన క్యారెట్ – 250 గ్రా., తరిగిన బీన్స్ – పావు కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, అల్లం – రెండు ఇంచుల ముక్క, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 1, కారం – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కరివేపాకు – ఒక రెమ్మ.
క్యారెట్ బీన్స్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత క్యారెట్, బీన్స్ ఫ్రై ముక్కలను ఆవిరి మీద ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనెలో వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉడికించిన క్యారెట్ ముక్కలు, బీన్స్, పసుపు, ఉప్పు వేసి కలపాలి. దీనిని పది నిమిషాల పాటు మధ్‌యస్థ మంటపై బాగా వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి కలపాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమం, కొత్తిమీర వేసి రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ బీన్స్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్, బీన్స్ ఫ్రైను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.