Carrot Bread Rolls : క్యారెట్లతో బ్రెడ్‌ రోల్స్‌.. ఎంతో రుచిగా ఉంటాయి.. తయారీ ఇలా..!

Carrot Bread Rolls : క్యారెట్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. క్యారెట్లలో ఉండే విటమిన్‌ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. వీటిని తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అయితే క్యారెట్లను కొందరు నేరుగా తినేందుకు ఇష్టపడరు. దాంతో ఏదైనా వంటకం చేసుకుని తినాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే క్యారెట్లతో ఎన్నో వంటకాలను చేయవచ్చు. వాటిల్లో క్యారెట్ బ్రెడ్‌ రోల్స్‌ ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. తయారు చేయడం కూడా సులభమే. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్‌ బ్రెడ్‌ రోల్స్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

బ్రెడ్‌ ముక్కలు – 9, క్యారెట్‌ తురుము – 1 కప్పు, పనీర్‌ తురుము – పావు కప్పు, కొబ్బరి తురుము – 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు (చిన్నగా తరగాలి), పచ్చి మిర్చి – 2 (పొడవుగా కట్‌ చేయాలి), మిరియాల పొడి – పావు టీస్పూన్‌, వెన్న – ఒక టీ స్పూన్‌, కారం – అర టీస్పూన్‌, నూనె – సరిపడా.

Carrot Bread Rolls make in this way very tasty
Carrot Bread Rolls

క్యారెట్‌ బ్రెడ్‌ రోల్స్‌ ను తయారు చేసే విధానం..

ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని కళాయిలో వెన్న వేసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ తురుము వేసి దోరగా వేయించాలి. తరువాత పనీర్‌ తురుము, కొబ్బరి తురుము వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఉప్పు, మిరియాల పొడి, కారం వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్‌ ముక్కలను నాలుగు వైపులా కట్‌ చేయాలి. వాటిలో ఉడికించి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసి రోల్‌ చేయాలి. రోల్‌ విడిపోకుండా బ్రెడ్‌ అంచుల్ని కాస్త తడిచేసి లోపలికి నొక్కేయాలి. వాటిని నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. దీంతో రుచికరమైన క్యారెట్‌ బ్రెడ్‌ రోల్స్‌ తయారవుతాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కనుక క్యారెట్‌ అంటే ఇష్టం లేని వారు కూడా వీటిని ఎంతో ఆసక్తిగా తింటారు. వీటిని నేరుగా తినవచ్చు. లేదా ఏదైనా చట్నీతో కలిపి తినవచ్చు.

Editor

Recent Posts