Carrot Rice : మనం వంటింట్లో అనేక రకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాము. రైస్ వెరైటీలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. చాలా తేలికగా ఇన్ స్టాంట్ గా చేసుకోదగిన రుచికరమైన రైస్ వెరైటీలలో క్యారెట్ రైస్ కూడా ఒకటి. క్యారెట్ రైస్ పుల్ల పుల్లగా చాలా రుచిగాఉంటుంది. కలర్ ఫుల్ గా కనిపించే ఈ రైస్ ను పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు ఇలా అప్పటికప్పుడు క్యారెట్ రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ క్యారెట్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క, లవంగాలు – 4, యాలకులు – 3, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, క్యారెట్ తురుము – ఒక కప్పు, అన్నం – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర, నిమ్మరసం – అర చెక్క.
క్యారెట్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత క్యారెట్ తురుము వేసి వేయించాలి. క్యారెట్ తురుము వేగిన తరువాత అన్నం, ఉప్పు వేసి కలుపుకోవాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర, నిమ్మరసం వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా మరోసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. లంచ్ బాక్స్ లోకి ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ తో రైస్ ను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.