Carrot Sweet : క్యారెట్.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. క్యారెట్ లో ఎన్నో విలువైనపోషకాలు ఉంటాయి. మన అందానికి, ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్ లను నేరుగా తినడంతో పాటు వీటితో రకరకాల స్వీట్ లను కూడా తయారు చేస్తూ ఉంటాము. క్యారెట్ లతో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. క్యారెట్ లతో తరచూ చేసే వంటకాలతో పాటు కింద చెప్పిన విధంగా చేసే తీపి వంటకం కూడా చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. క్యారెట్ తో రుచికరమైన ఈ స్వీట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ స్వీట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్స్ – అరకిలో, నీళ్లు – అరలీటర్, పంచదార – అర కప్పు, కార్న్ ఫ్లోర్ – 4 టేబుల్ స్పూన్స్, రెడ్ ఫుడ్ కలర్ – చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి – కొద్దిగా.
క్యారెట్ స్వీట్ తయారీ విధానం..
ముందుగా క్యారెట్ ల చివర్లను కట్ చేసి వాటిపై ఉండే చెక్కును పీలర్ తో తీసి వేయాలి. తరువాత క్యారెట్ లను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని నీటిని పోయాలి. తరువాత ఈ క్యారెట్ ముక్కలను మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. క్యారెట్ ముక్కలు మెత్తబడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను నీటితో సహా జార్ లోకి తీసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. తరువాత ఇదే జార్ లో పంచదార, కార్న్ ఫ్లోర్, ఫుడ్ కలర్ వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఒక కళాయిలోకి తీసుకుని మధ్యస్థ మంటపై కలుపుతూ ఉడికించాలి. దీనిని జెల్లీలాగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి.
క్యారెట్ మిశ్రమం దగ్గర పడిన తరువాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని చల్లారే వరకు అలాగే ఉంచాలి. క్యారెట్ మిశ్రమం చల్లారిన తరువాత దీనిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. తరువాత ఈ లడ్డూలకు చుట్టూ ఎండు కొబ్బరి పొడిని అద్ది ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ స్వీట్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. స్వీట్ తినాలనిపించినప్పుడు క్యారెట్ లతో ఇలా అప్పటికప్పుడు ఎంతో రుచికరమైనస్వీట్ ను తయారు చేసుకుని తినవచ్చు.