Catering Style Beans Carrots Fry : క్యారెట్, బీన్స్ ఫ్రై.. క్యారెట్స్, బీన్స్ కలిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి, సైడ్ డిష్ గా తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని ఎక్కువగా క్యాటరింగ్ వాళ్లు తయారు చేస్తూ ఉంటారు. ఈ ఫ్రైను ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. ఈ ఫ్రైను అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. ఈ క్యారెట్, బీన్స్ ఫ్రైను తినడం వల్ల మన శరీరానికి కూడా అనేక పోషకాలు అందుతాయి. దీనిని అదే స్టైల్ లో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. క్యాటరింగ్ స్టైల్ క్యారెట్, బీన్ప్ ఫ్రైను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాటరింగ్ స్టైల్ బీన్స్, క్యారెట్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీన్స్ – పావుకిలో, తరిగిన క్యారెట్స్ – 2, గంటపాటు నానబెట్టిన పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 5, ఎండుమిర్చి – 2, ఉప్పు – తగినంత, పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాటరింగ్ స్టైల్ బీన్స్, క్యారెట్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత బీన్స్, క్యారెట్ ముక్కలు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన తరువాత పెసరపప్పు వేసి కలపాలి. తరువాత వీటిపై మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు వేయించాలి. ముక్కలు, పెసరపప్పు బాగా వేగిన తరువాత ఉప్పు, కొబ్బరి తురుము వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ బీన్స్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తినవచ్చు. అలాగే పప్పు,సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా కూడాతినవచ్చు. ఈ విధంగా క్యారెట్, బీన్స్ ఫ్రై చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.