Cauliflower 65 : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. దీంతో మనం అప్పుడప్పుడూ కూరను కానీ, వేపుడును కానీ తయారు చేసుకుని తింటూ ఉంటాం. కాలీఫ్లవర్ వాసన కారణంగా దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ దీనిని తినడం వల్ల మన శరీరానికి కలిగే మేలు అంతా ఇంతా కాదు. కాలీఫ్లవర్ ను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, బీపీ, షుగర్ వంటి వాటిని నియంత్రించడంలో కాలీఫ్లవర్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
కాలీఫ్లవర్ తో చేసుకోగలిగిన వంటకాలలో కాలీఫ్లవర్ 65 కూడా ఒకటి. ఇది ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. దీనిని బయట హోటల్స్ లో ఎక్కువగా తయారు చేస్తారు. బయట దొరికే విధంగా కరకరలాడుతూ ఉండే కాలీఫ్లవర్ 65 ని మనం ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కాలీఫ్లవర్ 65 ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాలీఫ్లవర్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
కాలీఫ్లవర్ – 1 (మధ్యస్థంగా ఉన్నది), మైదా పిండి – 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, శనగపిండి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – తగినన్ని, ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, పొడుగ్గా తరిగిన పచ్చి మిర్చి – 4, జీడిపప్పు – కొద్దిగా, కరివేపాకు – కొద్దిగా.
కాలీఫ్లవర్ 65 తయారీ విధానం..
ముందుగా కాలీఫ్లవర్ ను తీసుకుని మరీ చిన్నగా కాకుండా కొద్దిగా పెద్దగా ఉండేలా ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని మరిగించాలి. నీరు మరిగిన తరువాత ముందుగా తరిగిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. కాలీఫ్లవర్ ముక్కల్లో నీరు అంతా పోయేలా ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, శనగ పిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి.
తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. తరువాత ముందుగా ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి వాటికి పండి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె పోసి నూనె కాగిన తరువాత కొద్ది కొద్దిగా కాలీఫ్లవర్ ముక్కలను వేస్తూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేయించుకున్న తరువాత మిగిలిన పిండిలో పచ్చి మిర్చిని, జీడిపప్పును, కరివేపాకును వేసి అదే నూనెలో వేసి వేయించి క్యాలీప్లవర్ ముక్కల పై వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ 65 తయారవుతుంది.
కాలీఫ్లవర్ తో తరచూ చేసే వంటకాలకు బదులుగా అప్పుడప్పుడూ ఇలా కూడా చేసుకుని తినవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల బయట క్యాటరింగ్ వాళ్లు చేసే విధంగా, హోటల్స్ లో దొరికే విధంగా ఉండే కాలీఫ్లవర్ 65 ను మనం ఇంట్లోనే చాలా సులభంగా రుచిగా తయారు చేసుకుని తినవచ్చు.