Pomegranate Tree : మన ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి వీలుగా ఉండే పండ్ల చెట్లల్లో దానిమ్మ చెట్టు కూడా ఒకటి. దానిమ్మ చెట్టు నుండి మనకు లభించే దానిమ్మ పండ్లు రుచిగా ఉండడంతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ పండ్లే కాకుండా దానిమ్మ ఆకులు, బెరడు, పూలు, మొగ్గలు, వేర్లపై బెరడు, దానిమ్మ పండ్లపై బెరడు ఇలా అన్నీ కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. దానిమ్మ చెట్టు మన ఇంట్లో కనుక ఉంటే అనారోగ్య సమస్యలను అప్పటికప్పుడు నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ చెట్టు, దానిమ్మ పండ్ల వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ చెట్టును సంస్కృతంలో దంద బీజ, సుఖ వల్లభ అని హిందీలో అనార్ అని అంటారు. దానిమ్మ చెట్టు పులుపు, వగరు, తీపి రుచులను కలిగి ఉంటుంది. మనకు వచ్చే వాత, పిత్త, కఫ సంబంధిత రోగాలను నయం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దానిమ్మలో కూడా పుల్ల దానిమ్మ, తీపి దానిమ్మ అని రెండు రకాలు ఉంటాయి. పుల్ల దానిమ్మ పుల్లగా ఉండి వాతాన్ని, కఫాన్ని పెంచుతుంది. కనుక మనం ఎక్కువగా తీపి దానిమ్మనే ఉపయోగించాలి. ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు దానిమ్మ పూలను దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని రెండు ముక్కు రంధ్రాలలోనూ రెండు చుక్కల మోతాదులో వేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు నుండి రక్తం కారడం తగ్గుతుంది.
దానిమ్మ చెక్కను మెత్తగా దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 2 నుండి 3 టీ స్పూన్ల మోతాదులో రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల మొలల నుండి రక్తం కారడం తగ్గుతుంది. దానిమ్మ చెక్కను 20 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 20 గ్రాముల కొడిసె పాల గింజలను కలిపి వాటిని ఒక పెద్ద గ్లాస్ పరిమాణమంత నీటిలో వేసి సగం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ నీటికి తేనెను కలిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. దానిమ్మ చెట్టు లేత ఆకులను, కలబంద రసాన్ని కలిపి నూరి కందిగింజల పరిమాణంలో మాత్రలుగా చేసుకోవాలి. వీటిని ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. చలిజ్వరం, మలేరియా జ్వరంతో బాధపడుతున్నప్పుడు పూటకు రెండు మాత్రల చొప్పున రెండు పూటలా మంచి నీటితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చలిజ్వరం, మలేరియా జ్వరం త్వరగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
దానిమ్మ గింజలను ఎండబెట్టి దంచి జల్లించిన పొడిని 10 గ్రాములు, అదే విధంగా జల్లించిన పుదీనా ఆకుల పొడిని 5 గ్రాములు, సౌంధవ లవణాన్ని 3 గ్రాముల మోతాదులో తీసుకుని వీటన్నింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి. అజీర్తి, కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు భోజనం అయిన తరువాత ఈ పొడిని మూడు వేళ్లకు వచ్చినంత పరిమాణంలో తీసుకుని నోట్లో వేసుకుని మంచి నీటిని తాగాలి. ఇలా రోజుకు రెండు పూటలా చేస్తూ ఉండడం వల్ల కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. దానిమ్మ పండ్ల బెరడును, ఉప్పును కలిపి మెత్తగా నూరి కంది గింజల పరిమాణంలో మాత్రలుగా చేసుకుని ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. పిల్లలు దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఈ మాత్రను తీసుకుని తేనెతో కలిపి నాకించాలి. పూటకు ఒక మాత్ర చొప్పున రెండు లేదా మూడు పూటలా ఇలా చేస్తూ ఉండడం వల్ల పసి పిల్లల్లో దగ్గు తగ్గుతుంది.
దానిమ్మ గింజలను, దివిసెన గింజలను, ఇంగువను సమానంగా తీసుకుని వాటిని తగినన్ని జిల్లేడు పాలతో కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని చిటికెన వేలు పరిమాణంలో మాత్రలుగా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. తేలు కాటుకు గురి అయినప్పుడు ఈ మాత్రను నీటితో అరగదీసి తేలు కుట్టిన చోట మందంగా రాయాలి. తరువాత వస్త్రాన్ని కాల్చి దానికి పొగ వేయాలి. ఇలా చేయడం వల్ల తేలు విషం హరించుకుపోయి తేలు కుట్టిన చోట నొప్పి కూడా పోతుంది. వృషణాల వాపుతో బాధపడుతున్న వారు దానిమ్మ ఆకులను నీటితో కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని వృషణాలపై లేపనంగా రాయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల వృషణాల వాపు, నొప్పి తగ్గుతాయి.
కొంత మంది గర్భిణీ స్త్రీలలో ఐదవ నెలలో గర్భం కదిలి రక్తస్రావం అవుతూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే దానిమ్మ ఆకులను, మంచి గంధం, తేనె, పెరుగును ఒక్కో దానిని 10 గ్రాముల మోతాదులో తీసుకుని కలిపి రెండు పూటలా సేవిస్తే గర్భస్రావం ఆగుతుందని నిపుణులు చెబుతున్నారు. నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నప్పడు దానిమ్మ కాయలపై బెరడును 50 గ్రాముల మోతాదులో తీసుకుని దంచి ఒక పాత్రలో వేయాలి. ఇందులోనే 2 గ్రాముల లవంగాలను, ముప్పావు లీటర్ నీటిని పోసి చిన్న మంటపై సగం నీరు మిగిలే వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి మూడు భాగాలుగా చేసి మూడు పూటలా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
నోటికి ఏదీ రుచిగా లేనప్పుడు తీపి దానిమ్మ కాయల రసంలో తేనెను కలిపి రెండు పూటలా తాగడం వల్ల అరుచి రోగం తగ్గుతుంది. దానిమ్మ పండ్ల రసంలో పంచదారను కలిపి ఒక కప్పు మోతాదులో మూడు పూటలా తాగుతూ ఉంటే నోటి నుండి రక్తం పడడం ఆగుతుంది. జ్వరం కారణంగా నోరు పగిలినప్పుడు దానిమ్మ గింజలను, చక్కెరను కలిపి నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల నోరు పగలడం తగ్గుతుంది. ఈ విధంగా దానిమ్మ చెట్టు మనకు ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో మనం దగ్గు, జ్వరం, నీళ్ల విరేచనాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ చెట్టును ఉపయోగించి మనం ఈ సమస్యలన్నింటి నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.