Chaddannam : చద్దన్నం అనగానే చాలా మంది రాత్రి మిగిలిన అన్నం అని అనుకుంటారు. రాత్రి మిగిలిన అన్నాన్ని పడేయడమో, తాళింపు వేసుకుని ఉదయం పూట తినడమో చేస్తూ ఉంటారు. ఈ చద్దానాన్ని కనుక పూర్వకాలంలో తీసుకున్నట్టు పెరుగుతో తీసుకుంటే రుచిగా ఉండడంతో పాటు మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. పెరుగులో పులియబెట్టి చద్దనాన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అన్నాన్ని పెరుగులో పులియబెట్టి ఎలా తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాతకాలం నాటి చద్దన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – అర కప్పు, అన్నం – రెండు కప్పులు, నీళ్లు – ఒక గ్లాస్, శొంఠి పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చి – 2.
పాతకాలం నాటి చద్దన్నం తయారీ విధానం..
ముందుగా ఒక మట్టి ముంతలో పెరుగు వేసి ఉండలు లేకుండా చిలకాలి. తరువాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు అన్నాన్ని వేసి కలపాలి. తరువాత శొంఠి పొడి వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి రాత్రంతా కదిలించకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల పెరుగు చక్కగా పులుస్తుంది. పెరుగు పులియడం వల్ల దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ప్రొబ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇలా రాత్రంతా పులియబెట్టిన తరువాత మరుసటి రోజూ ఉదయం ఈ అన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న చద్దనాన్ని ఆవకాయ లేదా నిమ్మకాయ పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకున్న చద్దనాన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేయడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.