Chakkera Pongali : మనం వంటింట్లో అనేక రకాల తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. అదే విధంగా చాలా సులువుగా, చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా చేసుకునే తీపి పదార్థాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో చక్కెర పొంగలి ఒకటి. మనం చక్కెర పొంగలిని తయారు చేస్తూనే ఉంటాం. దీని రుచి మనందరికీ తెలుసు. ఎంతో రుచిగా ఉండే ఈ చక్కెర పొంగలిని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర పొంగలి తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, పెసరపప్పు – అర కప్పు, పంచదార – ఒక కప్పు, బెల్లం తరుము – అర కప్పు, జీడిపప్పు పలుకులు – కొద్దిగా, ఎండు ద్రాక్ష – కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు – కొద్దిగా, పిస్తా పలుకులు – కొద్దిగా, బాదం పప్పు పలుకులు – కొద్దిగా, యాలకుల పొడి – అర టీ స్పూన్, పచ్చ కర్పూరం – చిటికెడు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – తగినన్ని.
చక్కెర పొంగలి తయారీ విధానం..
ముందుగా ఒక కుక్కర్ లో బియ్యాన్ని, పెసరపప్పును వేసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లను పోసి మూత పెట్టి 2 నుండి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యిని వేయడం వల్ల కుక్కర్ పొంగకుండా ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తరువాత దీనిని గరిటెను కానీ, పప్పు గుత్తి కానీ ఉపయోగించి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నెయ్యిని వేసి కరిగిన తరువాత ఎండు కొబ్బరి ముక్కలను వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో జీడిపప్పును, ఎండుద్రాక్షను, బాదం పప్పును, పిస్తా పలుకులను వేసి వేయించి వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మరో గిన్నెలో పంచదారను, బెల్లాన్ని వేసి అవి మునిగే వరకు నీటిని పోసి కలుపుతూ లేత పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తరువాత జల్లి గరిటెతో వడకట్టుకుంటూ ముందుగా ఉడికించుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమంలో పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై ఉడికించుకోవాలి. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను, డ్రై ఫ్రూట్స్ ను వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా నెయ్యిని, యాలకులపొడిని, పచ్చకర్పూరాన్ని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి తయారవుతుంది. తీపిని తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు చాలా సులువుగా ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలిని తయారు చేసుకుని తినవచ్చు.