Champaran Chicken : హైదరాబాద్ బిర్యానీ, తాపేశ్వరం మడత కాజా, ఆత్రేయపురం పూత రేకులు.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ప్రసిద్ది చెందుతుంది. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో చంపారన్ ప్రాంతంలో వండే చికెన్ కూడా చాలా ప్రసిద్ది పొందింది. ఈ చికెన్ ను తయారు చేసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది. ప్రత్యేకమే అయినప్పటికి ఈ చికెన్ కూరను తయారు చేయడం చాలా సులభం. ఎంతో రుచిగా ఉండే ఈ చంపారన్ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చంపారన్ చికెన్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, వెల్లుల్లి పాయలు – 4, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 4, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 8, బిర్యానీ ఆకులు – 3, నల్ల యాలక్కాయ – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 2, లవంగాలు – 4, అనాస పువ్వు – 1, మిరియాలు – 15, ఎండుమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్, కాశ్మీరీ కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – 2 టీ స్పూన్స్, చికెన్ మసాలా పొడి – 2 టీ స్పూన్స్, గరం మసాలా – ఒక టీ స్పూన్, సోంపు గింజల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఆవాల నూనె – అర కప్పు, నూనె – 2 టీ స్పూన్స్.
చంపారన్ చికెన్ తయారీ విధానం..
ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి పాయల పై ఉండే పలుచటి పొరను తొలగించి వాటిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఈ చికెన్ తయారీలో వెల్లుల్లి రెబ్బలను కాకుండా వెల్లుల్లి పాయ మొత్తాన్ని మనం కూరలో వేసుకోవాల్సి ఉంటుంది. తరువాత ఒక వెల్లుల్లి పాయలు, ఆవ నూనె, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి. తరువాత చేత్తో ఉల్లిపాయలల్లోని నీరు అంతా బయటకు వచ్చేలా నలుపుతూ బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో శుభ్రపరుచుకున్న చికెన్ ను, శుభ్రపరుచుకున్న వెల్లుల్లి పాయలను వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. తరువాత ఆవ నూనెను పొగ వచ్చే వరకు వేడి చేసి ఇందులో పోసి బాగా కలపాలి. తరువాత ఒక మట్టి గిన్నెను తీసుకుని అందులో నూనె వేసి చేత్తో గిన్నె అంతా రాయాలి. తరువాత మసాలా కలిపిపెట్టిన చికెన్ ను అందులో వేయాలి.
ఇప్పుడు గోధుమపిండిని లేదా మైదా పిండిని ఆవిరి బయటకు పోకుండా గిన్నె అంచుల చుట్టూ పెట్టాలి. తరువాత మూతను ఉంచి ఆవిరి బయటకు పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు గిన్నెను స్టవ్ మీద ఉంచి 5 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత మంటను చిన్నగా చేసి 40 నిమిషాల పాటు ఉడికించాలి. అడుగు మాడిపోకుండా గిన్నెను ఒకసారి జాగ్రత్తగా కదపాలి. స్టవ్ ఆఫ్ చేసిన పది నిమిషాల పాటు గిన్నెను అలాగే ఉంచాలి. తరువాత మూత తీసి స్వర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బీహార్ స్పెషల్ చంపారన్ చికెన్ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటి వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. వర్షాకాలం, చలికాలంలో ఇలా ప్రత్యేకమైన పద్దతుల్లో చేసే చంపారన్ చికెన్ ను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.